తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపే పరమావధిగా అటు కాంగ్రెస్, బీజేపీ(Bjp), బీఆర్ఎస్(BRS) పార్టీలు పావులు కదుపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఎంఐఎం పార్టీ వచ్చి చేరింది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ (MP Asaduddin Owaisi) హైదరాబాద్ పార్లమెంట్ (Hyderabad MP) స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
అయితే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ(Congress), ఎంఐఎం(MIM) పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు అక్కడ అభ్యర్థిని ఖరారు చేయలేదు.
దీంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, భవిష్యత్ లో ఎంఐఎం సపోర్టు మేరకు ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ ను కూడా ఫిక్స్ చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ప్రతిపక్షాల పోరు భరించలేక అభ్యర్థిని నిలబెట్టాలని హస్తం పార్టీ భావిస్తే డమ్మీ క్యాండిడేట్‌ను నిలబెట్టే చాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో పొత్తుపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా స్పందించారు. తాము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, ఎంపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలతో దేశానికి ఒరింగిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో తిరిగి విజయం సాధిస్తామని అసద్ ధీమా వ్యక్తం చేశారు.