తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు దాదాపుగా ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకు విమర్శలతో దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలు అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. కాగా ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ (BJP) ముఖ్యనేతలు కూడా రంగంలోకి దిగి బీఆర్ఎస్ పై విమర్శల దాడికి దిగారు.. ఆరోపణలతో రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు..
ఇప్పటికే కాంగ్రెస్ (Congress) బీఆర్ఎస్ (BRS) మధ్య హైడ్రామా నెలకొన్నట్టు తెలుస్తుంది. గెలుపు పగ్గాలు చేపట్టాలని రెండు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.. ఈ క్రమంలో ఖమ్మంలో సంజీవరెడ్డి భవన్లో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావుతో కలిసి జైరాం రమేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.. తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడ కనిపించట్లేదని, ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు.
బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్, ఎంఐఎం సీ టీమ్ గా మారి రాజకీయాలు చేస్తున్నాయని జైరాం రమేష్ ఆరోపించారు. పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడూ రాష్ట్రం అలాగే ఉందని విమర్శించారు. హైదరాబాద్కు పెట్టుబడులు అప్పుడు ఎలావచ్చేవో ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయని తెలిపిన జైరాం రమేష్.. తెలంగాణ ఏర్పాటు జరిగి పదేళ్లు అవుతున్నా ఎందుకు లక్ష్యాలు సాధించలేదని మండిపడ్డారు.
నిరుద్యోగుల శాతం అధికంగా ఉన్న తెలంగాణలో.. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి. ఉద్యోగాలు లభించక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అవ్వడం లేదని జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవిస్తూ.. తండ్రి, కోడుకు, కూతురు, అల్లుడు తెలంగాణ పాలిస్తున్నారని జైరాం రమేష్ (Jairam Ramesh) ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్కు బైబై చెప్పే రోజు వచ్చింది. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని తెలిపారు..