శబరిమల (Sabarimala)లో భక్తులు పోటెత్తుతున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తితో వెళ్తున్న స్వాములకి.. అయ్యప్ప దర్శనం అందని ద్రాక్షలా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.. మరోవైపు దర్శనానికి 20 గంటలకు పైగా సమయం తీసుకుంటోంది. గత అయిదు రోజులుగా భక్తుల రద్దీ భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో.. కేరళ ప్రభుత్వం (Kerala Govt) రద్దీని అంచనా వేయడంలో విఫలమైనట్టు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు..
సాధారణంగా సంక్రాంతి (Sankranti) ముందు అయ్యప్ప భక్తుల రద్దీ ఉండటం మామూలే.. కానీ ఈ సంవత్సరం భక్తులు భారీగా శబరిమలకి తరలి వెళ్లడంతో.. రద్దీని కంట్రోల్ చేయడం అధికారుల తరం కాలేదని అంటున్నారు.. దీనికి తోడు సరైన వసతులు కల్పించడంలో కూడా అధికారులు విఫలం అయ్యినట్టు తెలుస్తోంది. మరోవైపు ట్రైన్లలో బస్సుల్లో సొంత వాహనాల్లో వేలాదిగా భక్తులు అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారు..
ఇప్పటికే పలువురు యాత్రికులు క్యూలైన్లో నిరీక్షించలేక దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రావెన్కోర్ (Travancore) దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినప్పటికీ ఫలితం కన్పించలేదు. ఇదే సమయంలో శబరిమలలో భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ బీజేపీ (BJP) ఆందోళనకు దిగింది.
ఇదిలా ఉండగా శబరిలమలో నెలకొన్న పరిస్థితులపై కేరళ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆలయంలో రద్దీని నియంత్రించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకొంటున్నారని దేవదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. నిర్దేశిత ప్రవేశ మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకి చేరుకోవడం వల్ల ఆలయం దగ్గర ఇబ్బంది ఏర్పడుతోందని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయని వెల్లడించారు.. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు ప్రాధాన్యత ఇస్తుందని తెలియచేసారు.