అయోధ్య (Ayodhya)లో రామ మందిరా (Ram Mandhir)న్ని జనవరి 22న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ను సర్వంగా సుందరంగా తీర్చి దిద్దారు. దీంతో ఇప్పుడు అయోధ్య ధామ్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారుతోంది. రంగు రంగుల విద్యుత్ కాంతుల్లో అయోధ్య ధామ్ అద్భుతంగా కనిపిస్తోంది.
పునరుద్ధరించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను మొదటి దశలో సుమారు రూ. 240 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్ పక్కనే ఈ నూతన రైల్వే స్టేషన్ ను నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ను రామ మందిర డిజైన్లో నిర్మించారు. రైల్వే స్టేషన్ పై భాగంలోని రాజ మకుటం, విల్లులు శ్రీ రాముడికి అయోధ్యకు ఉన్న సంబంధాన్ని సూచించేలా నిర్మించారు.
రైల్వే స్టేషన్ లోని సెంట్రల్ డోమ్ ను శ్రీ రాముడి కిరీటాన్ని స్పూర్తిగా తీసుకుని నిర్మించారు. అందులో ఒక చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది సూర్యున్ని సూచిస్తుంది. ఇక రెండు అంతస్తుల భవనంపై ఉన్న రెండు శిఖరాలను జానకీ మాత ఆలయం నుంచి ప్రేరణ పొంది రూపొందించారు. ఈ శిఖరాల మద్య ఏడు మండపాలు ఉన్నాయి.
ఇక ఈ రైల్వే స్టేషన్ పైకప్పు డిజైన్ ను తామరపువ్వు రేకుల నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేశారు.
మధ్యాహ్న సమయంలో సహజ కాంతి స్టేషన్లో పడేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీంతో రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం తక్కువ విద్యుఛ్ఛక్తి ఖర్చవుతుంది. ఇక వర్షపు నీటిని ఒడిసి పట్టేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మురుగునీటి శుద్ది కోసం ప్రత్యేక యంత్రాలను అమర్చారు. ఈ రైల్వే స్టేషన్ భవనం మొత్తం మూడ అంతస్తుల్లో ఉంది. వాటిని గ్రౌండ్ ఫ్లోర్, మెజనైన్, ఫస్ట్ ఫ్లోర్లు అని అంటున్నారు. రెండవ అంతస్తులో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు ఉన్నాయి. ఈ
రైల్వే స్టేషన్లో మొత్తం 12 లిఫ్ట్లు, 14 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. మెజనైన్ ఫ్లోర్లో విశ్రాంతి గదులు, స్టేషన్ మాస్టర్, మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి. దీంతో పాటు ఇన్ ఫాంట్ కేర్ రూమ్, రైల్వే స్టేషన్ లో ప్రథమ చికిత్స అందించేందుకు ఒక గదిని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారాన్ని అందించేందుకు టూరిస్ట్ ఇన్ ఫర్మేషన్ సెంటర్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
రామ మందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ‘రాష్ట్ర’ వరుస కథనాలను అందిస్తోంది. భారీ భూకంపాలను తట్టుకునేలా అయోధ్య రామాలయ నిర్మాణానికి హైదరాబాద్ కు ఉన్న లింకేటి..? అనేది తర్వాత కథనంలో చూద్దాం.