హైదరాబాద్ Hyderabad) లో ప్రవల్లిక (Pravalika) అనే యువతి ఆత్మహత్య ఘటన సంచలనంగా మారింది. అశోక్ నగర్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోన్న ఈ యువతి పరీక్షలు వాయిదా పడటం వల్ల మరణించిందనే ప్రచారం జరిగింది. కాగా ఈ ఘటన పై ప్రతిపక్షాలు ప్రభుత్వం పై విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో విచారణను వేగవంతం చేసిన పోలీసులు (Police) నిజాలను వెలికితీయగా సంచలన విషయాలు బయట పడ్డాయి.
ఆ వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ (DCP) వెంకటేశ్వర్లు (Venkateshwarlu) వివరించారు. ప్రవల్లిక 15 రోజుల క్రితమే హాస్టల్లో చేరిందని, ఇప్పటి వరకూ ఆమె గ్రూప్-2 సహా ఎటువంటి పోటీ పరీక్షలు రాయలేదని వెల్లడించారు. ఆమె ఆత్మహత్యకు ప్రేమ (Love) వ్యవహారమే కారణం అంటున్న డీసీపీ, ప్రవల్లిక రూమ్‌లో సూసైడ్ నోట్ దొరికిందని తెలిపారు. ఆమె ఫోన్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
కాగా శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ప్రేమలో ఉన్న ప్రవల్లిక.. అతను వేరే యువతితో ఎంగేజ్ మెంట్ చేసుకోవడం వల్ల ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు. ప్రవల్లిక ప్రేమ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసన్నారు డీసీపీ వెంకటేశ్వర్లు.. మరోవైపు ప్రవల్లిక సూసైడ్ నోటును పరీక్షించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, నివేదిక ఆధారంగా శివరామ్ రాథోడ్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రవల్లిక ఆత్మహత్య పై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయొద్దని డీసీపీ కోరారు.