హైదరాబాద్ అశోక్ నగర్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మర్రి ప్రవల్లిక (Pravalika) మృత దేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారు. ఈ రోజు ఉదయం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి ఆమె మృత దేహం చేరుకుంది. ప్రవల్లిక మృతదేహాన్ని (Dead Body) చూసి ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. దీంతో బికాజి పల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి.
బిక్కాజి పల్లిలో ప్రవల్లిక అంత్య క్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా బికాజీ పల్లిలో భారీగా పోలీసులనుమోహరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని గ్రామస్తులు, ప్రవల్లిక కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు.
అశోక్ నగర్ లో ఉంటూ ప్రవల్లిక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అశోక్ నగర్ లోని బృందావన్ హాస్టల్లో ఆమె నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం వెలుగులోకి రావడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాస్టల్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.
గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడటంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారంటూ నిరసనకు దిగారు. ఈ క్రమంలో హాస్టల్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పరిస్థితిత ఉద్రిక్తంగా మారడంతో నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. తమ తల్లిదండ్రులు అప్పులు చేసి మరి తమను చదివిస్తున్నారి నిరుద్యోగులు అన్నారు. ఏండ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నామని, కానీ ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేస్తూ తమ జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు.