కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Governament) రేషన్ కార్డులను ఇస్తుందా లేక ఉన్న కార్డులు తొలగిస్తుందా అని ప్రజలు భయపడుతున్నారని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) అన్నారు. అందువల్ల దీనిపై ఖచ్చితమైన విధి విధానాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో ప్రజలు ఊరుకోరని తెలిపారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం మల్లా రెడ్డి మాట్లాడుతూ….. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించాలని కోరారు.
తొమ్మిదేండ్లుగా ప్రజలకోసం బీఆర్ఎస్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిలిపివేసిందని ఫైర్ అయ్యారు. తనకు భూములు ఎక్కువగా ఉండటంతోనే తనపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను ఎవ్వరినీ మోసం చేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బోడుప్పల్ వక్ఫ్‌బోర్డు బాధితులకు త్వరలోనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ నేతలు మున్సిపాల్టీల్లో అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారని అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీచేస్తానని చెప్పారు. తనపై పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఇప్పుడు గెలిచిన వ్యక్తిలాగా తిరుగుతూ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.