విశాఖ రామానాయుడు స్టూడియో ( Ramanaidu Studio) భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. లేఔట్ వేసి స్టూడియో భూములు విక్రయించడంపై స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే అప్పటి లక్ష్యాలను తుంగలో తొక్కుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా 20 ఎకరాల వినియోగానికి అనుమతి ఇచింది.
మరోవైపు సినీ అవసరాల కోసం 2003లో రామానాయుడు స్టూడియోకు ప్రభుత్వం 35 ఎకరాలు కేటాయించింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకే భూమి ఉపయోగించాలని ఆదేశించింది. అందుకు భిన్నంగా భూములు వినియోగించవద్దని పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు (MLA Velagapudi Ramakrishna Babu) హైకోర్టులో సవాలు చేశారు.
ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా హైకోర్టు కేసు కొట్టివేయడంతో ఎమ్మెల్యే వెలగపూడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ జరిపింది. రామానాయుడు స్టూడియో భూముల్లో ప్రస్తుతం లేఔట్ వేశారా, ఇతర కార్యకలాపాలు చేపట్టారా అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ మేరకు పిటిషనర్ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూముల్లో లేఔట్ వేసిన అమ్మకాలకు సిద్ధంగా ఉంచిందని సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు మార్చి 11వ తేదీ లోపు ఈ అంశంపై స్పందించాలంటూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.