టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu), ఐఆర్ఆర్ కేసులో (IRR Case) భారీ ఊరట లభించింది. ఆయన ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు (AP HighCourt) ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. దర్యాప్తు సమయంలో ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. నేడు పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం ఈ కేసులో నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఈ కేసుపై 2022లో ఎస్ఎల్ పీ దాఖలైంది. అందువల్ల 17A నిబంధన వర్తిస్తుందా? అని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ.. పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని కోర్టుకు తెలిపారు. సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. అది ఎలా వర్తిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు సుప్రీంకోర్టులో బాబుకు సంబంధించి ఉన్న ఇతర కేసుల వివరాలను కోరింది.
వాటిని బాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అందజేశారు. అన్ని వివరాలను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. మిగిలిన కేసుల్లోనూ సాధారణ బెయిల్ మంజూరైంది కదా అని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తరపున ఉన్న లాయర్ కొన్ని కేసుల్లో సాధారణ, మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని తెలిపారు. అందుకు ధర్మాసనం ఐఆర్ఆర్ కేసులో సహ నిందితులు బెయిల్ పై ఉన్నప్పుడు చంద్రబాబు కూడా బయట ఉంటే నష్టమేంటని ప్రశ్నించింది. వారిపై ఉన్న ఉత్తర్వులు ఆయనకూ వర్తిస్తాయని స్పష్టం చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.