కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (Medigadda) లక్ష్మీ బ్యారేజీ (Lakshmi Barrage) పిల్లర్లు కుంగడం స్థానికంగా కలకలం రేపింది. రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రతిపక్షాలకు ఈ ఘటన బలమైన ఆయుధంగా మారింది. మరోవైపు లక్ష్మీ బ్యారేజీ పై స్పందించిన కేంద్రం రంగంలోకి దిగి ఓ కమిటీని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిశీలనకు పంపింది.
కాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ.. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో బుధవారం భేటీ అయింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం ఇంజినీర్లతో చర్చించింది. ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించింది. ఈ సమావేశంలో తెలంగాణ (Telangana) ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్‌డీ శ్రీధర్ దేశపాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు..
ఇక సమావేశం అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కీలక విషయాన్ని వెల్లడించారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవని తెలిపారు.. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగిందని అన్నారు.. ఈ సమస్య ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి కాపర్ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తాం అని మురళీధర్‌పేర్కొన్నారు.
క్వాలిటీ ఆఫ్ సాండ్, క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌పై అనుమతులు ఉన్నాయి. అయినా ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నాం అని వెల్లడించారు. మరోవైపు పిల్లర్ కుంగుబాటు వల్ల కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదని, యథావిధిగా సాగునీటిని అందించే అవకాశం ఉన్నదని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే తెలిపారు..