జనవరి 22న జరిగే రామ మందిర (Ram Mandir)ప్రారంభోత్సవం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. జనవరి 22న దేశ ప్రజలు దీపావళి లాగా జరుపుకోవాలన్నారు. ఆ రోజున ప్రతి ఇంటా ‘రామ జ్యోతి’వెలిగించాలని పిలుపునిచ్చారు. జనవరి 22 తర్వాత ప్రతి ఒక్కరూ అయోధ్యను దర్శించుకోవాలని ప్రధాని మోడీ కోరారు.
అయోధ్యలో వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ….. జనవరి 14 నుంచి దేశవ్యాప్తంగా అన్ని తీర్థక్షేత్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయోధ్యను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అయోధ్య వాసులదే అని తెలిపారు. అయోధ్యధామ్‌లో ఎక్కడా అపరిశుభ్రత కనిపించకూడదని సూచించారు. రామ్ లల్లా ఒకప్పుడు టెంట్ లో ఉండాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఆయనకు పక్కా ఇంటిని సుందరంగా నిర్మించామన్నారు.
జనవరి 22న భక్తులంతా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించాలని అంతా అనుకుంటారని చెప్పారు. కానీ రద్దీ దృష్ట్యా జనవరి 22న అయోధ్యకు రావద్దని భక్తులను ఆయన కోరారు. ఆ తర్వాత రోజు నుంచి శ్రీ రామున్ని జీవితాంతం దర్శించుకునే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల భక్తులు 23 నుంచి అయోధ్యను దర్శించుకోవాలన్నారు.
ఏ దేశమైనా అభివృద్ధిలో కొత్త స్థాయిని చేరుకోవాలంటే, దాని వారసత్వాన్ని కాపాడుకోవాలన్నారు. అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం భారత్‌ను ముందుకు తీసుకెళ్తాయని పేర్కొన్నారు. భారతదేశ వారసత్వం సరైన మార్గాన్ని చూపుతోందన్నారు. నేటి భారత్ ఆధునికతతో పాటు సంప్రదాయాన్ని మిళితం చేస్తూ పురోగతి సాధిస్తోందని మోడీ వెల్లడించారు. ఈ రోజు యూపీలో రూ.వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామన్నారు.
ఈ ఆధునిక మౌలిక వసతులు అనేవి భారత చిత్రపటంపై అయోధ్యను సగర్వంగా నిలబెడతాయని వివరించారు. నేటి సరికొత్త భారత్ తీర్థ క్షేత్రాలను సుందరంగా తీర్చిదిద్దుతోందన్నారు. ఇటీవల వందే భారత్ రైళ్లు, నమో భారత్ రైళ్ల తర్వాత సిరీస్ రైళ్లు వచ్చాయన్నారు. వాటికి తాము అమృత్ భారత్ రైళ్లు అని నామకరణం చేశామన్నారు. వీటన్నిటి శక్తి భారతీయ రైల్వే అభివృద్ధిలో సహాయపడుతుందన్నారు.
ఈ రోజు తాను అయోధ్య ధామ్ విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రారంభించానన్నారు. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. శ్రీరాముడు చేసిన మంచి కార్యాలను వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా మనకు పరిచయం చేశారని వివరించారు. ఆధునిక భారత్‌లో, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్ రెండూ రామమందిరంతో మనల్ని కలుపుతాయన్నారు.
ఇది ఇలా వుంటే మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ రోజు మొదటి విమానం బయలుదేరింది. మొదటి విమానంలో ప్రయాణించిన భక్తులు హనుమాన్ చాలీసా పఠించారు. మరోవైపు అయోధ్య బాబ్రీ మసీదు స్థలం కేసు పిటిషనర్ ఇక్బాల్ అన్సారీ అయోధ్యలో రోడ్‌షో సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై పూలు జల్లుతు ఘన స్వాగతం పలికారు.