లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించి ఈడీ (ED) తనకు తప్పుడు సమన్లు పంపిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) తెలిపారు. లిక్కర్ పాలసీ కుంభకోణంపై రెండేళ్లుగా విచారణ జరుగుతోందన్నారు. ఎనిమిది నెలల క్రితం సీబీఐ తనను విచారణకు పిలిచిందని చెప్పారు. దానికి తాను హాజరయ్యానని అన్నారు. సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని వెల్లడించారు.
ఈడీ ఇచ్చిన సమన్లు లీగల్‌గా చెల్లవని స్పష్టం చేశారు. సమన్ల పేరుతో తనను విచారణకు పిలిచి అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈడీ సమన్లు ఎందుకు అక్రమమైనవనే విషయంపై తాను ఈడీకి లేఖ రాశానన్నారు. కానీ ఇప్పటి వరకు ఈడీ నుంచి సమాధానం రాలేదన్నారు. తనకు లీగల్ గా నోటీసులు పంపించి ఉంటే తాను విచారణకు సహకరించి ఉండేవాడినన్నారు.
ఈ కేసులో పలువురు ఆప్ నేతలను అక్రమంగా ఇరికించారని, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా వారిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. తనకు ఉన్న బలం తన నిజాయితేనని వివరించారు. అందుకే తప్పుడు ఆరోపణలతో తన ప్రతిష్టను దెబ్బతీసి తనను బలహీనున్ని చేయాలని బీజేపీ భావిస్తోందన్నారు. గత రెండేండ్లుగా ఈ కేసులో విచారణ జరగుతోందన్నారు. చాలా సార్లు సీబీఐ, ఈడీ దాడులు కూడా చేసిందన్నారు.
కానీ ఒక్క రూపాయి కూడా పట్టుబడినట్టు దర్యాప్తు సంస్థలు ఎక్కడా వెల్లడించలేదని చెప్పారు. కుంభకోణం జరిగి ఉంటే ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఆ డబ్బంతా కేవలం గాలిలో మాయమైందా అని ఎద్దేవా చేశారు. వాస్తవం ఏంటంటే అసలు అవినీతి జరగలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తనను అడ్డుకునేందుకు బీజేపీ తనను అరెస్టు చేయించాలని చూస్తోందని ఆరోపించారు.