విశాఖ (Visakha) ఫిషింగ్ హార్బర్ (Fishing Harbour)లో జరిగిన బోట్ల దగ్ధం కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.. సుదీర్ఘ విచారణ అనంతరం కేసును ఛేదించిన విశాఖ పోలీసులు అసలు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. కాగా విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన బోట్ల దగ్ధం (Fire Incident) కేసులో భాగంగా సుమారు 50 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించినట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న సుమారు 30 మందిని విచారించగా.. వాసుపల్లి నాని, అతని మామ సత్యం నిందితులుగా తేలిందని కమిషనర్ పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి మద్యం మత్తులో చేసిన తప్పిదమే ఈ భారీ అగ్ని ప్రమాదాలకు కారణమని తేల్చారు.. ఘటన జరిగిన 6 రోజులకు అసలు నిందితులను పట్టుకున్నట్టు తెలిపిన రవిశంకర్.. ఈ కేసులోని నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్టు వెల్లడించారు..
మరోవైపు నిందితులు 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు మద్యం తాగడానికి హార్బర్ కు వచ్చారని తెలిపిన కమిషనర్..మద్యం మత్తులో సిగరెట్ తాగి పక్కన ఉన్న 815 నెంబర్ బోటుపై పడేసారని వెల్లడించారు. దీంతో మెల్లగా మంటలు చెలరేగి పక్కన ఉన్న బోట్లకు వ్యాపించాయని సీపీ తెలిపారు. ఈ ప్రమాదాన్ని గమనించిన నిందితులు మెల్లగా అక్కడి నుండి జారుకున్నారన్నారని అన్నారు.
నిందితులపై ఐపీసీ సెక్షన్ 437, 438, 285, క్రింద కేసు నమోదు చేసినట్టు కమిషనర్ రవిశంకర్ తెలిపారు. అయితే ఈ కేసు దర్యాప్తు లో భాగంగా చాలా మంది అనుమానితులను విచారించామని.. అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్న కారణంగా యూట్యూబర్ నానిని తీసుకొచ్చి విచారణ చేశామని సీపీ తెలిపారు.. మరోవైపు ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం అవ్వగా.. 18 బోట్లు పాక్షికంగా డామేజ్ అయ్యాయని.. రూ 8 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.