దేశానికి బలమైన పునాది వేసే అనేక విప్లవాత్మక సంస్కరణలు (Reforms) ఈ ఐదేండ్ల కాలంలో చాలా వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. ఈ ఐదేండ్ల కాలం సంస్కరణలు , పనితీరు, పరివర్తనకు గుర్తుగా నిలిచిపోతాయని తెలిపారు. అనేక తరాలుగా ఎదురుచూస్తున్న చారిత్రక నిర్ణయాలకు 17వ లోక్‌సభ కాలంలో మోక్షం లభించిందని వివరించారు.
బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు లోక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ…. ప్రజలు శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న పనులను పూర్తి చేసేందుకు దిగువ సభలోని సభ్యులందరి సమిష్టి కృషిని ప్రధాని ప్రశంసించారు. తమ ప్రభుత్వ పాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఈ కాలంలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని వెల్లడించారు.
గత ఐదేండ్లలో అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల అనేక కష్టాలు పడ్డామని అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేశంలో అభివృద్ధి మాత్రం ఆగలేదని వివరించారు. సంస్కరణలు, పనితీరు ఒకేసారి కనిపించడం చాలా అరుదని వెల్లడించారు. తమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నామన్నారు.
రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించి ఆమోదాన్ని ప్రస్తావిస్తూ…. దేశ వారసత్వంపై గర్వపడేలా భావి తరాలకు రాజ్యాంగపరమైన అధికారాన్ని అందజేస్తామని ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370 రద్దు ఈ కాలంలోనే జరిగిందని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయాన్ని కూడా ఈ సభలోనే తీసుకున్నామని అన్నారు. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నారీశక్తి వందన్ చట్టాన్ని తీసుకు వచ్చామన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను ఈ లోక్‌సభ ఆమోదించిందని వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్లకు పద్మ పురస్కారం ఇచ్చి గొప్ప మార్పు దిశగా అడుగువేశామని పేర్కొన్నారు. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం భావి భారతానికి ఎంతో ఉపయోగకరమన్నారు. ముద్ర యోజన ద్వారా చిరువ్యాపారులకు రుణాలు ఇచ్చామని…తాము చేపట్టిన చర్యలతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మలు సంతోషిస్తాయని భావిస్తున్నామన్నారు.
ఏం జరిగినా మీ (స్పీకర్ ఓం బిర్లా) ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుందని…. ఈ సభను స్పీకర్ నిష్పక్షపాతంగా నడిపించారని వివరించారు. అందుకు స్పీకర్ ను అభినందిస్తున్నామని చెప్పారు. కోపం, ఆరోపణలు వచ్చిన సమయాలు కూడా ఉన్నాయని.., కానీ మీరు ఈ పరిస్థితులను ఓపికగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ సభను అత్యంత తెలివిగా నడిపారని కితాబిచ్చారు.
రాబోయే 25 ఏళ్లు దేశానికి అత్యంత కీలకమన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించనుందని చెప్పారు. త్వరలోనే దేశంలో ఎన్నికలు జరగనున్నాయని …. ఈ ఎన్నికలపై తనకు చాలా విశ్వాసం ఉందని వివరించారు. ఎన్నికల ద్వారా దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయ కార్యకలాపాలు ఎప్పుడూ ఉంటాయని… వచ్చే 25 ఏళ్లలో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నది దేశ ఆకాంక్ష అని వెల్లడించారు.