పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడును పెంచాయి. ఈ క్రమంలోనే రెండ్రోజుల కిందట హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంఐఎం నేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Mp Asaduddin Owaisi) మరోసారి బరిలోకి దిగారు. దీంతో తన సోదరుడి కోసం చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Mla Akbaruddin Owaisi) హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్బంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. మా అన్నదమ్ములు ఇద్దరినీ చంపాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతకుముందు తమను జైలుకు పంపించే ప్రయత్నం కూడా జరుగుతోందని చెప్పారు.
తమకున్న అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా తుపాకీతో మమ్మల్ని కాల్చి హత్య చేస్తారని పిస్తోందన్నారు. అయితే, ఇలాంటి వాటికి తాము భయపడబోమన్నారు. హైదరాబాద్‌లో తాము చాలా బలంగా ఉన్నామని, మమ్మల్ని ఓడించేందుకు ప్రత్యర్థులు తమపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ఎవరు ఎంత ప్రయత్నించినా.. ఏం చేసినా.. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుపు ఎంఐఎం పార్టీదేనని చెప్పారు. ఇదిలాఉండగా, రెండ్రోజుల కింద అసదుద్దీన్ ఓవైసీ కూడా తనపై హత్యాయత్నం జరిగే ప్రమాదం పొంచి ఉన్నదని సంచలన ఆరోపణలు చేశారు. కాగా, ఓవైసీ బ్రదర్స్ ఎన్నికల్లో మైనార్టీల ఓట్లు దండుకోవడానికే ఇలా సింపతీ పాలిటిక్స్ రాజేస్తున్నారని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.