Telugu News » Hyderabad : మహిళపై థర్డ్ డిగ్రీ.. ఇదేనా బంగారు తెలంగాణ?

Hyderabad : మహిళపై థర్డ్ డిగ్రీ.. ఇదేనా బంగారు తెలంగాణ?

చిత్రహింసలకి గురిచేయడమే కాకుండా రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.

by admin
Telangana-state-police-1

రెండేళ్ల క్రితం జరిగిన మరియమ్మ లాకప్ డెత్ ఘటన.. పోలీస్ శాఖకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో ప్రభుత్వంపైనా విమర్శలు వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదని ఎల్బీనగర్ లో తాజాగా జరిగిన ఘటన రుజువు చేసింది. అకారణంగా మహిళను చావగొట్టారు పోలీసులు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా.. విమర్శలపాలు అవ్వాల్సి వచ్చింది.

Telangana-state-police-1

అసలేం జరిగింది..?

బాధితురాలి కథనం ప్రకారం.. ఆమె మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉంటోంది. కుమార్తె పెళ్లి కోసం సరూర్‌ నగర్‌ లోని బంధువుల ఇంటికి డబ్బుల కోసం వెళ్లింది. ఆగస్టు 15న రాత్రి తిరిగి ఎల్బీనగర్‌ కు రాగా పోలీసులు ఆపారు. ఎవరు నువ్వు..? ఇక్కడేం చేస్తున్నావు..? ఏంటీ కథ..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ఫలానా అని చెప్పినా వినిపించుకోలేదు. అన్నీ తెలుసులే.. అంటూ వెటకారంగా మాట్లాడుతూ.. ఆమెను తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌ కు తీసుకువెళ్లారు. చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎదురు తిరిగితే నీ సంగతి తెలుసు అంటూ.. ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలు వాపోతోంది. ఉదయం ఓ అధికారి ఆదేశాల మేరకు బాధితురాలిని ఎల్బీనగర్ పోలీసులు వదలిపెట్టారు. ఈ దాడిలో ఆమె నడవలేని స్థితికి చేరుకుంది. అకారణంగా పోలీసులు తనని కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ఉన్నతాధికారుల చర్యలు

ఈ విషయం మీడియాకు తెలియడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ చౌహాన్ స్పందిస్తూ.. ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులపై వేటు వేసినట్టు తెలిపారు. దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక తెప్పించుకున్న సీపీ.. ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు.

You may also like

Leave a Comment