పాకిస్తాన్ (Pakisthan) మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి భారత్ కానీ, అమెరికా కానీ కారణం కాదని తెలిపారు. మన కాళ్లను మనమే నరుక్కున్నామని పేర్కొన్నారు. పాక్‌లో పాలనను శాసిస్తున్న సైన్యాన్ని ఉద్దేశించి ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇది స్వయం కృతాపరాధమని అన్నారు.
పాక్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ….. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని వెల్లడించారు. దీనికి అమెరికా లేదా భారత్ కారణం కాదని చెప్పారు.
ఒక్క మాటలో చెప్పాలంటే మన కాళ్లను మనమే నరుక్కున్నామని తెలిపారు. 2018 ఎన్నికల్లో మనపై బలవంతపు ప్రభుత్వాన్ని రుద్దారంటూ ఫైర్ అయ్యారు. దీంతో ప్రజలు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చివరకు అది ఆర్థిక సంక్షోభానికి కూడా దారి తీసిందన్నారు. సైనిక నియంతల నిర్ణయాలకు న్యాయమూర్తులు మద్దతుగా నిలిచారంటూ మండిపడ్డారు.
సైనిక నియంతలకు న్యాయమూర్తులు పూల మాలలు వేసి స్వాగతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా వారి పాలనను చట్టబద్ధం చేస్తారని నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రిని తొలగించిన ప్రతిసారీ దాన్ని న్యాయమూర్తులు ఆమోదించారని ధ్వజమెత్తారు. ఇదంతా ఎందుకు జరిగిందో ఆలోచించాలన్నారు.