కాంగ్రెస్ (Congress) పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. సమాజానికి న్యాయం చేయని వ్యక్తులే ఇప్పుడు న్యాయ యాత్ర గురించి ఆలోచిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఓ వైపు దేశాన్ని ప్రధాని మోడీ ముందుకు తీసుకు వెళ్తుంటే మరోవైపు ఇండియా కూటమి దేశాన్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
యూపీలో వికసిత్ సంకల్ప్ సభలో జేపీ నడ్డా పాల్గొని మాట్లాడుతూ…. గత కొన్నేండ్లుగా భారత్ ను విచ్ఛిన్నం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోని కొందరు వ్యక్తులు భారత్ జోడో యాత్రకు బయలుదేరారని నిప్పులు చెరిగారు. సమాజానికి అన్యాయం చేయడంలో ఎలాంటి అవకాశాన్ని వదులుకోని ఈ రోజు న్యాయ యాత్ర గురించి ఆలోచిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కుటుంబం గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించని వాళ్లు నేడు దేశం గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రయత్నిస్తోందన్నారు. స్టార్టప్ ఇండియా, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి అనేక పథకాల ద్వారా దేశంలోని యువతకు సాధికారత కల్పించేందుకు ప్రధాని మోడీ కృషి చేశారని వెల్లడించారు.
తాను మహిళలు, రైతులు, యువకులు, పేదలు అనే నాలుగు కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని ప్రధాని మోడీ చెప్పారని గుర్తు చేశారు. ఈ నాలుగు కులాలను బలోపేతం చేస్తేనే అభివృద్ధి చెందిన భారత్ అనే కల సాకారం అవుతుందని వివరించారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌ను గూండాల రాష్ట్రంగా పిలిచేవారని చెప్పారు. కానీ ఇప్పుడు మోడీజీ ఆశీర్వాదం, యోగీజి హార్డ్ వర్క్ తో యూపీ ఇప్పడు అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.