– బీఆర్ఎస్ కు వరుస షాకులు
– ఇప్పటికే తెలంగాణలో ఓటమితో డీలా
– ఇతర రాష్ట్రాల్లోనూ ఖాళీ అవుతున్న పార్టీ
– కర్ణాటకలో కుమారస్వామి, ఒడిశాలో హ్యాండిచ్చిన గమాంగ్
– ఆంధ్రాలో తోట, రావెలపై అనుమానాలు
– పార్టీ మారుతున్నట్టు జోరుగా ప్రచారం
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని తెగ ప్రయత్నించారు. ప్రధానంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు. కర్ణాటకలో జేడీఎస్ (కుమారస్వామి), యూపీలో ఎస్పీ (అఖిలేష్ యాదవ్) తో కలిసి ముందుకెళ్లారు. కానీ, కర్ణాటక ఎన్నికలకు ముందు కుమారస్వామి హ్యాండిచ్చారు. అఖిలేష్ కూడా ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఒడిశాలో అయితే పార్టీ ఖాళీ అయిపోయింది. మహారాష్ట్ర నేతలు సైలెంట్ అయిపోయారు. ఇక, ఆంధ్రాలోనూ అయోమయ పరిస్థితి నెలకొంది. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలు ఏవీ కొనసాగడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆశలన్నీ అడియాశలవ్వడంతో ఆంధ్రాలో కీలకంగా ఉన్న ఇద్దరు లీడర్లు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
జనసేనలోకి తోట రీఎంట్రీ..?
గతంలో జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించిన తోట చంద్రశేఖర్ కు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి ఆఫర్ ఇచ్చారు కేసీఆర్. దీంతో ఆయన జనసేనను వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. అట్టహాసంగా పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించారు. కానీ, కీలకమైన ఎన్నికల సమయంలో సైలెంట్ అయిపోయారు. ఈయన తిరిగి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. 2019 ఎన్నికల్లో జనసేన తరుఫున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తోట చంద్రశేఖర్. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీ తరుపున గుంటూరు పార్లమెంటుకు పోటీ చేశారు. ఈయన విద్యావంతుడు, ఆర్థికంగా బలవంతుడు. పైగా, కాపు సామాజివర్గం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తోట జనసేనలోకి రీఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
త్వరలో పవన్ తో భేటీ..?
జనసేనలో చేరికపై చర్చించేందుకు తోట చంద్రశేఖర్ త్వరలో పవన్ కళ్యాణ్ ను కలవనున్నారని పొలిటికల్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా గుంటూరు పశ్చిమ సీటును జనసేనకు కేటాయించాలని టీడీపీ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తోట దీనిపై కన్నేసినట్టు సమాచారం. టీడీపీ, జనసేన సభ్యులతో ఈయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తోట పోటీ చేస్తానంటే ఎవరూ అడ్డు చెప్పరనే ప్రచారం జరుగుతోంది. పైగా, ఆర్థికంగా బలమైన వైసీపీ అభ్యర్థి రజనీకి చెక్ పెట్టాలంటే.. తోట చంద్రశేఖరే కరెక్ట్ అనే ఆలోచనలో టీడీపీ, జనసేన ఉన్నట్టుగా అనుకుంటున్నారు.
వైసీపీలోకి రావెల..?
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు టీడీపీ నుంచి బీజేపీ తర్వాత జనసేనలోకి వెళ్లి అనంతరం బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈయన ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎలాంటి యాక్టివిటీ లేదు. నేతలు కూడా కార్యాలయానికి రాకపోతుండటంతో ఆఫీస్ మూసివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రావెల వైసీపీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. ఈయన జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు. ఇక, తోట, రావెలతోపాటు బీఆర్ఎస్ లో చేరిన చోటామోటా లీడర్లు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మొత్తానికి.. కాస్తో కూస్తో ఆంధ్రాలో సెటిల్ అవుదామనుకున్న బీఆర్ఎస్.. తట్టా బుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు రాజకీయ పండితులు.