– ఓడేది కారు..
– హస్తం గెలుపు ఖరారు అంటున్న రేవంత్
– బీఆర్ఎస్ తోనే తెలంగాణ చరిత..
– కేసీఆర్ తోనే రాష్ట్రానికి భవిత అంటున్న కేటీఆర్
– రానున్నది నిశ్శబ్ద విప్లవం..
– బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండోస్థానమేనంటున్న కిషన్ రెడ్డి
– ఎన్నికల షెడ్యూల్ రాకతో హీటెక్కిన పాలిటిక్స్
– గెలుపు వ్యూహాల్లో పార్టీలు
– నేతల మధ్య పేలుతున్న పంచ్ లు
– మూడు పార్టీలదీ ఒకటే నినాదం
తెలంగాణ (Telangana) ఎన్నికల యుద్ధం మొదలైంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. ప్రత్యర్థి పార్టీలను మాటలతోనే చెడుగుడు ఆడుకుంటున్నాయి. మమ్మల్నే నమ్మండి.. వాళ్లను నమ్మితే నట్టేట మునగడమేనంటూ.. అది చేశారు, ఇది చేశారంటూ ఆడిపోసుకుంటున్నాయి. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ఒక్క ఛాన్స్ అని అడుగుతుంటే.. బీఆర్ఎస్ (BRS) ఔర్ ఏక్ బార్ కేసీఆర్ సర్కార్ అంటూ ప్రజలను వేడుకుంటోంది. ఈ క్రమంలోనే మాటల యుద్ధం పీక్స్ కు చేరుతోంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్, మోడీ ఒక్కటేనని కలిసే డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ ను ఎదగనీయకుండా చేయాలనేదే వీరి కుట్రగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో జరిగిన పరిణామాలను వివరిస్తున్నారు. కాబట్టి, బీజేపీ, బీఆర్ఎస్ ను నమ్మొద్దని కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమం ఉంటుందని చెబుతున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే.. కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. తాజాగా ‘‘ఆరు వారాలు.. ఆరు హామీలు.. ఆరు నూరైనా ఓడేది కారు.. హస్తం గెలుపు ఖరారు’’ అంటూ పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ పాలనలో అన్నీ స్కాములేనంటూ విమర్శలు చేస్తున్నారు రేవంత్. కల్వకుంట్ల స్కామిలీ అంటూ టీజ్ చేస్తున్నారు. దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తాడని.. మోసపోయిన దళితుడు, రక్షణ లేని ఆడకూతురు, కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి, నిలువ నీడలేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం కేసీఆర్ ను సాగనంపుతారని మండిపడుతున్నారు.
ఈసారి గెలుపు ఏకపక్షమే అనేది బీఆర్ఎస్ వాదన. కేసీఆర్ కు ప్రజలు మరోసారి పట్టం కడతారని గులాబీ శ్రేణులు ధీమాగా చెబుతున్నారు. గ్రామగ్రామాన సంక్షేమం, అభివృద్ధే తమను గెలిపిస్తాయని అంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని వాటిని నమ్మొదని ప్రజలను హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే.. భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ మూడున వచ్చే ఫలితాల్లో ముచ్చటగా మూడోసారి గెలిచేది మనసున్న ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు కేటీఆర్. పదేండ్ల ప్రగతి తమ పాశు పతాస్త్రం.. విశ్వసనీయతే విజయ మంత్రం అని ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. మంచి చేసే బీఆర్ఎస్ పార్టీకే ప్రజల ఓటు వేస్తారని.. ముంచే పార్టీలపై వేటు తప్పదని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు గుండె గుండెలో గులాబీ జెండా ఎగురుతోందని తెలిపారు. 2014లో తొలి అసెంబ్లీ ఎన్నికను “ఉద్యమ చైతన్యం” నడిపించిందని.. 2018లో “సంక్షేమ సంబురం” గెలిపించిందని.. 2023లో “పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం” శాసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమరానికి బీఆర్ఎస్ సర్వసన్నద్ధమని.. కానీ, కాంగ్రెస్ అస్త్రసన్యాసం.. పోటీకి ముందే పూర్తిగా కాడి పడేసిన కమలం అంటూ సెటైర్లు వేశారు. ప్రతిపక్షాల ట్రిక్కులు పని చేయవని తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని చెబుతున్నారు.
మరోవైపు, బీజేపీదీ ఇదే మాట. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని చెబుతోంది. ఆ రెండు పార్టీలను నమ్మి మోసపోవద్దని.. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని.. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. రెండో స్థానం కోసం ఈ రెండు పార్టీలూ పోటీ పడాలని.. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి తమ స్ట్రాటజీ తమక ఉందని చెబుతున్నారు. ప్రచారం కోసం కమిటీలు వేసుకున్నామని, ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నామినేషన్ల ఘట్టం చివరి రోజు వరకు అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా మూడు పార్టీల నేతలు ఒకటే నినాదం చేస్తున్నారు. మమ్మల్నే నమ్మండి.. ఇతర పార్టీలను నమ్మి మోసపోకండి అంటూ ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. మరి, ప్రజలు ఎవరిని నమ్ముతారనేది డిసెంబర్ 3న తేలిపోతుంది.