తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కాంగ్రెస్ లో చేరారు. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ (BRS) కు రాజీనామా చేసిన తుమ్మల సాయంత్రం కాంగ్రెస్ (Congress) పార్టీ కండువా కప్పుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల (CWC) సందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తుమ్మలకు సీటు దక్కకపోవడంతో పార్టీలో సైలెంట్ గా ఉన్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ నాయకులు పలు దఫాలు తుమ్మలతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ లో తుమ్మల చేరుతారా, చేరరా అనే సస్పెన్స్ కు ఇవాళతో తెరపడింది. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో ఖర్గే…తుమ్మలకు హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మల హస్తం పార్టీలో చేరడంతో..ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయలు మారే అవకాశం ఉంది.
ఇక తుమ్మల రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గొల్లగూడెంలో జన్మించిన తుమ్మల నాగేశ్వరరావు 1982లో తెలుగు దేశం పార్టీలో చేరారు. 1983లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 1985లో తొలి సారి సత్తుపల్లి నుంచి గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1994, 1999లో టీడీపీ సత్తుపల్లికి ప్రాతినిథ్యం వహించారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా సత్తుపల్లి ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఖమ్మం నుంచే పోటీ చేసి తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున గెలిచారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తుమ్మల ఓడిపోయారు.
2018 ఎన్నికల ఓటమి తర్వా తనుంచి బీఆర్ఎస్‌కు దూరంగానే ఉంటూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారని తుమ్మల భావించారు. కానీ సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో.. తుమ్మలకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడంతో…ఆయనకు ఏ నియోజకవర్గం టిక్కెట్ ఇస్తారో చూడాలి.