మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావు(Thummala nageshwar rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల విస్తృతంగా పర్యటిస్తున్నారు. మామిళ్ల గూడెంలో వెంకటకృష్ణ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన ఆత్మీయ పలకరింపు సభలో తుమ్మల మాట్లాడారు.
రాష్ట్రంలో విచ్చలవిడితనంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన చేస్తున్నారంటే మనందరికీ సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరేచోట పోటీ చేయాల్సిన అవసరం ఉన్నా ఇక్కడ అదిరిచ్చి బెదిరించి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇలాంటి కథలన్నింటినీ తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో చూశానన్నారు తుమ్మల. కుండాకోరు రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇలాంటి పనికి మాలిన వారి మాటలు వినే అధికారులు ఎవరైనా ఉంటే తాట తీస్తానని హెచ్చరించారు. ఖమ్మంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు వచ్చానని, విదేశాల్లో పిల్లలు ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలనేది తన కోరిక అన్నారు.
దేశం గర్వించేలా నందమూరి తారక రామారావు లాంటి మహానేత ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రామారావు, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన అవకాశాన్ని జిల్లా అభివృద్ధికి కృషి చేశానన్నారు. తుమ్మల ఇటీవల బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.