మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్‌కు ఆయన రాజీనామా లేఖ పంపారు. ఇక.. సాయంత్రం కాంగ్రెస్ (Congress) లో తుమ్మల చేరుతారనే టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా తుమ్మలతో కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో ఆయన పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు లేఖ పంపించారు.
ఇక తుమ్మల రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గొల్లగూడెంలో జన్మించిన తుమ్మల నాగేశ్వరరావు 1982లో తెలుగు దేశం పార్టీలో చేరారు. 1983లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 1985లో తొలి సారి సత్తుపల్లి నుంచి గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1994, 1999లో టీడీపీ సత్తుపల్లికి ప్రాతినిథ్యం వహించారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా సత్తుపల్లి ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఖమ్మం నుంచే పోటీ చేసి తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున గెలిచారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తుమ్మల ఓడిపోయారు.
2018 ఎన్నికల ఓటమి తర్వా తనుంచి బీఆర్ఎస్‌కు దూరంగానే ఉంటూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారని తుమ్మల భావించారు. కానీ సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో.. తుమ్మలకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
పార్టీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేస్తారని కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న వార్తలు ఇవాళ నిజమయ్యాయి. ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. నేటి నుంచి హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ఇవాళ తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
మొదట సెప్టెంబర్ 17న తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారని వార్తలు వినిపించాయి. కానీ శనివారం సెప్టెంబర్ 16నే ఆయన హస్తం తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.