తిరుమల (Tirumala) బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మురంగా సాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) జరుగుతుండటం విశేషం. ఈ నెల 18 నుంచి ప్రారంభం కాబోయే తొలి బ్రహ్మోత్సవాలను టీడీపీ (TTD) ఈవో ధర్మారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.
మాడవీధుల్లోని గ్యాలరీల నుంచి రెండు లక్షల మంది భక్తులు స్వామి వారి వాహన సేవలను తిలకించవచ్చునని తెలిపారు. గరుడ సేవ రోజున భక్తుల సౌకర్యం కోసం ఇన్నర్ రింగ్ రోడ్ లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాడవీదుల్లో 6 ప్రాంతాల నుంచి స్వామివారి వాహన సేవను తిలకించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే వేంకటేశ్వరుడు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన ఆశ్వయుజంలోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించారట. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదు గానీ, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవని టీటీడీ తెలిపింది.
ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని టీటీడీ తెలిపింది.