బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన కొన్నిగంటల్లోనే ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత వాతారణం నెలకొంది. ఆదివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) ఓటమిపాలు కాగా కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావు(Thummala Nageshwar Rao) గెలుపొందారు. అధికారం మారడంతో ఖమ్మం(Khammam)లో గ్రూపు తగాదాలు షురూ అయ్యాయి.
ఖమ్మం జిల్లాలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీఎన్జీవో(TNGO) ఉద్యోగులు ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. పువ్వాడ అజయ్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఓ వర్గం మాజీ టీఎన్జీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావుకు చెందిన మరో వర్గం పరస్పర దాడులకు దిగాయి.
అసలు ఏం జరిగిందంటే.. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా అబ్జల్ హసన్ వర్గం వ్యవహరించింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత టీఎన్జీవో అధ్యక్షుడు అబ్జల్ హసన్ ఒక వర్గం తమను అన్యాయానికి గురి చేసి అక్రమాలకు పాల్పడ్డారని మాజీ టీఎన్జీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు వర్గం ఆరోపించింది.
అధికారంలో ఉన్నప్పుడు టీఎన్జీవో కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చాడని అబ్జల్ హసన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీఎన్జీవో కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని శ్రీనివాస రావు వర్గం అక్కడికి చేరుకుంది. అంతకుముందే ముందే అబ్జల్ హసన్ వర్గీయులు కార్యాలయానికి తాళం వేసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. అనంతరం అబ్జల్కు వ్యతిరేకంగా టీఎన్జీవో ఉద్యోగులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.