పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచాంగ్ తుపాను (Michaung Cyclone) తీవ్రరూపం దాల్చింది. ఈ తుపాను తీరాన్ని దాటే సమయంలో 110 కి.మీ. వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ (ఐఎండీ) పేర్కొంది. మంగళవారం ఉదయం కోస్తాంధ్ర తీర ప్రాంతం మచిలీపట్నం-బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో ‘మిచాంగ్’ తీరం దాటనుంది.
ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షపాతం తీవ్ర తుపాను ప్రభావంతో గడిచిన 24గంటల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. తిరుపతి పూలతోట వద్ద 30సెం.మీ., నాయుడు పేటలో 24 సెం.మీ, నెల్లూరు గాంధీనగర్ 22 సెం.మీ., కట్టువపల్లేలో 21 సెం.మీ., వెంకటాచలంలో 19.7 సెం.మీ., తిరుపతి జిల్లా అల్లంపాడు వద్ద 26 సెం.మీ., నెల్లూరులో 25.4 సెం.మీ వర్షపాతం, చిట్టేడులో 19 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
చెన్నైకి 90 కి.మీ., నెల్లూరుకు 120 కి.మీ., మచిలీపట్నం, బాపట్ల తీరాలకు 300 కి.మీ. దూరంలో ‘మిగ్జాం’ కేంద్రీకృతమవుతుంది. నిజాంపట్నం వద్ద తీరాన్ని దాటిన తర్వాత తీవ్రతుపాను నుంచి తుపానుగా బలపడుతుంది. తీరాన్ని దాటిన అనంతరం తెనాలి, విజయవాడ మీదుగా తుపాను దూసుకెళ్తుంది. మంగళవారం అర్ధరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి.
తీవ్ర తుపాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత చేరువగా రావటంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు, గాలులతో తుపాను విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. తీరప్రాంతాల్లో అలజడి ఇప్పటికే తిరుపతి, నెల్లూరు తీరప్రాంతాల్లో తీవ్రస్థాయిలో అలజడి నెలకొని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని సూళ్లూరుపేట, ఒంగోలు, కొవ్వూరు, చీరాల, మచిలీపట్నం, అవనిగడ్డ, రేపల్లె మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు సముద్రపు నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. తీవ్ర తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.