అయోధ్య (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) డైలమాలో పడింది. అయోధ్యలో ‘రామ్ లల్లా’విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలా? వద్దా ? అనే విషయంలో కాంగ్రెస్ సందిగ్ధ స్థితిలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అదీర్ రంజన్ చౌదరీలకు ఆహ్వానాలు అందాయి. కానీ తాము ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ లేదా ఆమె తరఫున కాంగ్రెస్ ప్రతినిధులు బృందం రామ మందిరానికి వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే వెల్లడించారు. ఆ అంశంలో ఆమె చాలా పాజిటివ్ గా ఉన్నట్టు తెలిపారు. కానీ దీనిపై సోనియా గాంధీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ సందిగ్ధంలో ఉన్నట్లు సీనియర్ నేతల ద్వారా వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్ మిత్రపక్షాలైన సీపీఎం, ముస్లిం లీగ్, టీఎంసీలు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించాయి. మతాన్ని రాజకీయంగా చూడలేమని ఆ పార్టీలు పేర్కొన్నాయి. అందుకే తాము రామాలయ ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని తేల్చి చెప్పాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేక సతమతం అవుతోందని తెలుస్తోంది.
వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చి వేసి ఆ స్థలంలో ఇప్పుడు రామ మందిర నిర్మాణాన్ని చేపట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరైతే అది ముస్లిం వర్గాల్లో ఎలాంటి సందేశం పంపుతుందో అనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటునేది ఆసక్తికరంగా మారింది.
ఈ విషయంపై త్వరలోనే కాంగ్రెస్ ఓ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ శశి థరూర్ తెలిపారు. సీపీఎంకు ఎలాంటి మతపరమైన విశ్వాసాలు ఉండవని చెప్పారు. అందుకే వాళ్లు అంత సులువుగా నిర్ణయం తీసుకోగలిగారని అన్నారు. తాము సీపీఎం కాదు, బీజేపీ కాదన్నారు. అందుకే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతోందని వివరించారు.