కొద్ది రోజుల కిందటి వరకు టమాటా రైతు (Farmer) ని రాజుగా నిలుచోబెట్టిన టమాటా(Tomato) పంట నేడు ధర పడిపోడంతో రైతు కంట కన్నీరు కార్చేలా చేస్తోంది. మూడు నెలల కిందట కిలో టమాటా రూ.300 వరకూ వెళ్లగా…. నేడురూ.30 పైసలు పలుకుతోంది. భారీగా పతనమైన టమాటా ధర (Rates) తో ఆవేదన చెందిన రైతులు తాము పండించిన టమాటాలను మార్కెట్ బయట పడేస్తున్నారు.
ఎన్ని పంటలు వేసినా రానన్ని లాభాలు ఒక్క టమాటా పంటతోనే రావడంతో ఇటీవల రైతులు తెగసంబరపడిపోయారు. ఒకరిని చూసి మరొకరు టమాటా పంట సాగుచేయడం మొదలు పెట్టారు. దీంతో మార్కెట్ లోకి పంట ఎక్కువగా రావడంతో రేట్ల అమాంతం పడిపోయాయి. ఇరవై రోజుల్లోనే పరిస్థితులు మారిపోడంతో టమాటా రైతులు దిగాలు పడిపోయారు.
హోల్ సేల్ మార్కెట్ లో కిలో టమాటా రూ.300 ఉండే టమాటా ఇరవై రోజుల వ్యవధిలోనే కిలో రూ.100కి చేరడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ధరైనా కొద్ది రోజులు నిలబడుతుందని అంచనా వేశారు. కానీ ఊహించని రేంజ్ లో ధర మరింత పతనమవడం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలా, కర్నూలు తదితర వ్యవసాయ మర్కెట్లలో నిన్న, ఇవాళ టమాటా ధర భారీగా పతనమైంది. 25 కేజీల కేటు రూ. 10 నుంచి రూ.35 పలకడంతో రైతులకు కనీసం రవాణా ఛార్జీలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల కిందట ఊహించనన్ని లాభాలతో ఇంటికి చేరిన రైతు నేడు మాత్రం ఒట్టి చేతులతో వెనుదిరిగాడు. నిరాశకు గురైన కొద్దిమంది రైతులు తమ పంటలను రోడ్డు మీద పడేశారు.