స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో టీడీపీ అధినేతలు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ (TDP) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి (Atchannaidu)కు ఏపీ హైకోర్టు (AP High Court)లో ఊరట లభించింది. స్కిల్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ తరపు న్యాయవాది సమయం కోరారు. ఈ మేరకు కేసుల అచ్చెన్నాయుడిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. విచారణ ఏప్రిల్ 2కి వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుల జాబితా క్రమక్రమంగా పెరుగుతోంది. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సీఐడీ (CID) విజయవాడలోని కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ప్రముఖ పేర్లను చేర్చింది.
ఈ కేసులో చంద్రబాబుపై 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు సీఎం జగన్. రూ.241కోట్లను షెల్ కంపెనీలకు పంపారని ఆరోపణలు వచ్చాయి. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గంటా శ్రీనివాసరావును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నవంబర్ 20వ తేదీన చంద్రబాబు హైకోర్టు నుంచి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను అచ్చెన్నాయుడు హైకోర్టులో దాఖలు చేయగా తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనపై తొందరపాటు చర్యలు వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.