తెలుగు రాష్ట్రాల్లో రథ సప్తమి(Ratha Sapthami) వేడుకలను పలు ఆలయాల్లో వేడుకగా నిర్వహిస్తున్నారు. సూర్య భగవానుడి జన్మించిన సుదినం ఈరోజు. ఈ సందర్భంగా తిరుమల(Tirumla) శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఇవాళ(శుక్రవారం) ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. అరసవల్లిలో రథసప్తమి తొలి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇటు తిరుమలలో స్వామి వారి సూర్యప్రభ వాహన సేవ వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుంచి వాహనమండపానికి వేంచేపు చేసారు. విశేష సమర్పణ చేపట్టారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ మొదలైంది. అక్కడినుంచి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలికిరణాలు శ్రీ మలయప్పస్వామివారి పాదాలను స్పర్శించాయి.
అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో తొలి పూజా కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్వామి వారిని దర్శించుకున్నారు. మూల విరాట్‌కు ఉదయం 7 గంటలకు వరకు మహాక్షీరాభిషేకం నిర్వహించనున్నారు. స్వామి వారి దర్శనం కోసం గురువారం రాత్రి నుంచే భక్తులు భారీ ఎత్తున అరసవల్లికి చేరుకున్నారు