Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj Singh Chouhan) పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ (Kamalnath) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాబోయే ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలుకుతారని అన్నారు. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ మంచి నటుడని అందుకే ఆయన రాజకీయ నిరుద్యోగిగా ఉండరన్నారు.
సాగర్ జిల్లాలోని రెల్హి అసెంబ్లీ నియోజక వర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ…. పోలీసులు, డబ్బు, పరిపాలనతో నడిచే బీజేపీ ప్రభుత్వానికి ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని కమల్ నాథ్ చెప్పారు.
ఎన్నికల అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవి కోల్పోతారన్నారు. అయినప్పటికీ ఆయన నిరుద్యోగిగా మారడన్నారు. శివరాజ్ సింగ్ మంచి నటుడని అన్నారు. నటనా వృత్తిని కొనసాగించేందుకు, మధ్యప్రదేశ్ కు కీర్తిని తీసుకు వచ్చేందుకు శివరాజ్ సింగ్ ముంబైకి వెళ్తారంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని శివరాజ్ సింగ్ గతంలో హామీ ఇచ్చాడన్నారు. కానీ ఉద్యోగాల భర్తీ చేయలేదన్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే కనీసం బ్యాక్ లాగ్ పోస్టులనైనా ఆ ప్రభుత్వం భర్తీ చేయాల్సిందన్నారు. చౌహాన్ ప్రభుత్వ ఉద్దేశమేంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.