తెలంగాణ(Telangana) ఇంటర్మీడియట్ పరీక్షలు(Intermediate Examinations) ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడిన విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రం యాజమాన్యంపై చర్యలు ఉంటాయన్నారు. ఈసారి ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,718మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,02,260మంది ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాల్లో 12,559 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 6,109 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,450 మంది విద్యార్థులు మొత్తం 30 కేంద్రాల్లో 20 ప్రభుత్వ, 10 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షలు రాయనున్నారు.
పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు 8.45 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలి. కాలేజీ యాజమాన్యం బలవంతంగా ఫీజులు వసూలు చేయకుండా హాల్ టిక్కెట్లు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్షలకు అనుమతించాలని కోరుతున్నాయి.