హైదరాబాద్ (Hyderabad) లో గజ్జల యోగానంద్ ఫౌండేషన్ (GY Foundation) ఆధ్వర్యంలో ‘సనాతన సమ్మేళన్’ కార్యక్రమం జరిగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో దీన్ని నిర్వహించారు. సమాజాన్ని ప్రభావితం చేసే జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ పుష్పేంద్ర కుల శ్రేష్ఠ (Pushpendra Kulsreshtha) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీజేపీ శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ (Gajjala Yoganand) పాల్గొన్నారు.
పుష్పేంద్ర కుల శ్రేష్ఠ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాటలను గుర్తు చేశారు. దేశ విభజనకు సంబంధించి అంబేద్కర్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారన్నారు. దేశంలో ఒక్క ముస్లిం మిగిలి ఉన్నా కూడా విభజన అసంపూర్తిగా జరిగినట్టేనని అంబేద్కర్ తన పుస్తకంలో రాశారని గుర్తు చేశారు. సనాతన హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలన్నారు. సమాజంలో మార్పు మొదలయిందని.. మీ చుట్టూ ఉన్నవాళ్ళకి ధర్మం గురించి తెలియచేయడం బాధ్యతగా భావించాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ.. పుష్పేంద్ర కుల శ్రేష్ఠ విచ్చేసి సనాతన ధర్మ విశిష్టతను, మన జీవన సరళి యొక్క ప్రాముఖ్యతను వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సనాతన ధర్మం, ఆధ్యాత్మికత మేళవించిన మార్గంతో మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుందని అన్నారు. ఇది సకల మానవాళికి మాత్రమే కాదు వసుదైక కుటుంబం అన్న భావనను కల్పిస్తుందని తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పుష్పేంద్ర కుల శ్రేష్ఠకు గజ్జల యోగానంద్, ఫౌండేషన్ సభ్యులు శాలువాతో సత్కరించారు.