కలుషితమైన నీటిని తీసుకోవడం ద్వారా అనేక రోగాలు వ్యాప్తి చెందుతాయి. సాధారణంగా వర్షాకాలంలో నీరు అధికంగా కలుషితం అవుతూ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కలుషిత నీటిని(poluted water) తాగడం వలన కలరా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని సమాచారం.
గత కొన్నిరోజులుగా బెంగళూరులో నీటి ఎద్దడి నెలకొంది. తాగేందుకు నీరు దొరక్క, అవసరాలకు తీర్చుకోలేక బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కలరా వ్యాప్తి జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మల్లేశ్వరం అనే ప్రాంతంలో కలరా వ్యాధి (Cholera Disease) నిర్దారణ జరిగినట్లు బృహత్ బెంగళూరు(Bangalore) మహానగర పాలికే చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ్ స్పష్టంచేశారు.
బెంగళూరులోని స్పర్ష్ హాస్పిటల్లోని కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ శ్రీహరి డి మాట్లాడుతూ.. నగరంలో ఇటీవలి రోజుల్లో కలరా కేసులు 50 శాతం పెరిగాయని, సగటున రోజుకు 20 కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.
కేసులు పెరగడానికి అపరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్య లోపమే కారణమని పేర్కొన్నారు.నగరంలోని అనేక ప్రైవేట్ ఆస్పత్రులు సాధారణంగా నెలకు ఒకటి లేదా రెండు కలరా కేసులను మాత్రమే నివేదించాయి. కానీ, మార్చి నెలలో రోజుకు ఆరు నుంచి ఏడు వరకు కేసుల పెరుగుదల నమోదైంది. తీవ్రమైన నీటి కొరత కారణంగా కొందరు కలుషిత మైన నీటిని సరఫరా చేయడమే ఇందుకు కారణంగా అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.