Telugu News » AP BJP: విశాఖ సీటు రభస.. ఢిల్లీకి చేరుకున్న బీజేపీ శ్రేణులు..!

AP BJP: విశాఖ సీటు రభస.. ఢిల్లీకి చేరుకున్న బీజేపీ శ్రేణులు..!

విశాఖ నుంచి టీడీపీ(TDP) నేత శ్రీభరత్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత బీజేపీకే కేటాయించాలని కమలంలో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ బీజేపీ నేతలు ఇవాళ(గురువారం) ఢిల్లీ చేరుకున్నారు.

by Mano
AP BJP: Visakha seat lost.. BJP ranks reached Delhi..!

విశాఖ(Vizag)లో పోటీకి అనుమతి ఇవ్వాలని బీజేపీ(BJP) నేతలు హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వైజాగ్ లోక్‌సభ సీటుపై కూటమిలో విబేధాలు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి టీడీపీ(TDP) నేత శ్రీభరత్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత బీజేపీకే కేటాయించాలని కమలంలో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ బీజేపీ నేతలు ఇవాళ(గురువారం) ఢిల్లీ చేరుకున్నారు.

AP BJP: Visakha seat lost.. BJP ranks reached Delhi..!

కూటమికి, పొత్తుకు తాము వ్యతిరేకం కాదంటూనే విశాఖ లోక్‌సభకు పోటీ చేయకుంటే పార్టీ రాష్ట్రంలో చచ్చిపోయినట్లే అంటూ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం లోక్‌సభ సీటును బీజేపీ తరఫున జీవీఎల్ నరసింహారావుకు కేటాయించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బుధవారం లేఖను పంపిన నేతలు పలు డిమాండ్‌లను ప్రస్తావించారు. విశాఖలో బీజేపీకి మొదటి నుంచి పట్టు ఉన్నదని పేర్కొన్నారు.

విశాఖ మేయర్‌గా ఎన్ఎస్ఎన్ రెడ్డి, ఎంపీగా కంభంపాటి హరిబాబు, విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు, ఎంఎల్సీగా పీవీఎన్ మాధవ్‌ను ఎన్నుకున్న చరిత్ర విశాఖదని తెలిపారు. విశాఖపట్నం ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలని వెల్లడించారు. తెలుగుదేశంతో పొత్తు కుదిరిందని తెలిశాక విశాఖ సీటు బీజేపీకే వస్తుందని తామంతా అనుకున్నామని, అయితే జీవీఎల్ నరసింహారావుకే సీటు కేటాయిస్తారని అనుకున్నామని చెప్పారు.

మూడేళ్లుగా జీవీఎల్ విశాఖలో అన్నివర్గాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖ అభివృద్ధికి జీవీఎల్ అంకిత భావంతో పనిచేశారని గుర్తుచేశారు. విశాఖ సీటును బీజేపీకి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం గట్టిగా పట్టుబట్టలేదని తాము భావిస్తున్నామని జాతీయ అధ్యక్షుడికి పంపిన లేఖలో పేర్కొన్నారు.

హెచ్‌పీసీఎల్, స్టీల్ ప్లాంట్, షిప్‌యార్డ్, పోర్ట్ ట్రస్ట్, బీహెచ్ఈఎల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ, గెయిల్.. ఇలా అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖలో ఉన్నాయని, ఈ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు విశాఖలో నివాసం ఉంటున్నారని రాసుకొచ్చారు. నిర్విరామంగా పార్టీ కోసం పనిచేసిన జీవీఎల్ వంటి నేతలకు టికెట్ రానప్పుడు సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఈ పరిస్థితులను గమనించి తెలుగుదేశంతో పొత్తుల్లో మార్పులు, చేర్పులు చేయాలని, జీవీఎల్‌కు విశాఖ సీటు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మరోవైపు జమ్మలమడుగును బీజేపీకి మార్చి కడప లోక్ సభ ఇస్తున్నప్పుడు విశాఖ లోక్ సభ ను కూడా మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

You may also like

Leave a Comment