ఢిల్లీ లిక్కర్ కేసు (Liquor Case)లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తొమ్మిది సార్లు ఈడీ (ED) విచారణకు హాజరు కాకుండా దాటవేశారు.. అయితే చివరికి ఆయన అరెస్ట్ తో ఈ కేసు ఉత్కంఠంగా మారింది. మరోవైపు ఢిల్లీ (Delhi) హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. అరెస్టైనా సీఎంగా కొనసాగడంపై దాఖలైన పిల్ కొట్టివేసింది. కానీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆయనకు షాకిచ్చింది..
తాజాగా కేజ్రీవాల్ కస్టడీని పొడగించాలని ఈడీ కోరుతుండటంతో రౌస్ ఎవెన్యూ కోర్టు అందుకు అంగీకరించింది. ఈడీ మరో 7 రోజులు ఆయనను కస్టడీకి అప్పగించాలని కోరగా.. మరో 4 రోజులు కస్టడీని కోర్టు పొడగించింది. కాగా కేజ్రీవాల్ భార్యకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక ఫోన్లోని సమాచారాన్ని సేకరించినట్లు ఈడీ పేర్కొంది. మరోవైపు మార్చి 21న కేజ్రీవాల్ నివాసంలో సీజ్ చేసిన 4 డిజిటల్ డివైజెస్ నుంచి ఇంకా సమాచారం సేకరించలేదని తెలిపింది.
ఇదిలా ఉండగా కేజ్రీవాల్‌ని మార్చి 21న అరెస్ట్ చేయగా ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు (Rouse Avenue Court) మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ రోజుతో కస్టడీ చివరి రోజు కావడంతో.. ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. చివరకు 4 రోజులకు కోర్టు అనుమతినిచ్చింది. మరోవైపు ఈడీ చర్యలపై కేజ్రీవాల్ మండిపడుతున్నారు.. కావాలనే ఈ కుట్రలో ఇరికిస్తోందని ఆరోపణలు చేశారు..
ఛార్జిషీట్లో తన పేరును ఈడీ, సీబీఐ (CBI) ఎక్కడా పేర్కొనలేదన్నారు.. ఎవరి ఆదేశాలతో ఈడీ పని చేస్తుందో తెలుసని అన్నారు.. వారు రెండు లక్ష్యాలతో పనిచేస్తోన్నారని తెలిపారు.. లిక్కర్ కేసులో తనను ఇరికించడంతో పాటు, ఆప్ పార్టీని మూసేయాలని చూస్తోందని కేజ్రీవాల్ కోర్టులో పేర్కొన్నారు.. ఇదంతా రాజకీయ కుట్రగా ఆరోపించారు.. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకొనేందు ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు..