తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ప్రధాన రహదారులు సైతం పూర్తిగా నీట మునిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఈ వర్షానికి తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.
తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లో మాత్రం రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అంతేకాకుండా, రాబోయే ఐదు రోజుల పాటు రాయలసీమ, కేరళలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.