– చివరి దశకు లిక్కర్ కేసు
– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
– సోదాల తర్వాత అదుపులోకి తీసుకున్న అధికారులు
– ఇప్పటిదాకా కేసులో నలుగురు ఆప్ నేతల అరెస్ట్
– అరెస్ట్ పై మినహాయింపు ఇవ్వలేమన్న హైకోర్టు
– తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే కేజ్రీవాల్ అరెస్ట్
– కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఆప్ నేతల ధర్నా
– సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
ఢిల్లీ లిక్కర్ కేసు చివరి దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఈమద్యే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకుంది. దీంతో లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ నేతల సంఖ్య 4కి చేరింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యారు.
గురువారం సాయంత్రం రెండు బృందాలుగా కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న అధికారులు రెండు గంటల పాటు సోదాలు జరిపారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఆప్ నేతలు. ఇది అక్రమ అరెస్ట్ అంటూ మండిపడుతున్నారు.
కేజ్రీవాల్ ఇంటి దగ్గర ధర్నాకు దిగారు. అయితే, కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని మంత్రి ఆతిషి తెలిపారు. సుప్రీం కోర్టులో కేసు వేశామని, అత్యవసరంగా విచారించాలని సర్వోన్నత న్యాయస్థానాన్నిడిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈడీ, బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయొచ్చు కానీ, ఆయన ఆలోచల్ని కాదని చెప్పారు. మనీశ్ సిసోడియాను అరెస్టు చేసినా ఇప్పటివరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
ఇప్పటివరకు 600 మందికి పైగా అరెస్టు చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ గొంతు అణిచివేసేందుకే ఆయన్ను అరెస్టు చేశారని విమర్శించారు.