బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) శుభవార్త చెప్పింది. సాధారణంగా ఆదివారం (SUNDAY) బ్యాంకులకు సెలవు అని అందరికీ తెలిసిందే. ప్రతి నెలా ఆదివారం, రెండో శనివారం బ్యాంకులకు సెలవు దినాలు. అందుకే ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే జనాలు వర్కింగ్ డేస్‌లోనే (Working days) బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే, ఈనెలలో చివరి ఆదివారం బ్యాంకులు పనిచేయనున్నాయి.
మార్చి 31వ తేది ఆదివారం బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 31న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU) నార్మల్ డేస్‌లో వలే సేవలు అందిస్తాయని తెలిపింది.
ఎందుకంటే ఈ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు రోజు ఆదివారం కావడంతో ఆర్ బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, మార్చి 31న ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకులకు సెలవు దినంగా పరిగణించనున్నారు. బ్యాంకు దస్త్రాల ఆడిటింగ్ కోసం ఏప్రిల్ 1న లావాదేవీలు జరగవు.
కావున, సెలవు దినమైనా ఆదివారం రోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకుల శాఖలు యథావిధిగా పనిచేయాలని ఆర్బీఐ సూచించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ప్రభుత్వ లావాదేవీలు, ఖాతాల్లోకి నగదు చెల్లింపులు,జమలను యథావిధిగా కొనసాగించాలని ఆర్బీఐ స్పష్టంచేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు మార్చి 31న తమ కార్యకలాపాలను నిర్వహించనుంది.