Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం బీసీ కుల గణన తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెట్టింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఈ తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు.. కాగా బీసీ కుల గణన తీర్మానంపై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి (Dundru Kumaraswamy) స్పందించారు. బీసీ కులగణన తీర్మాణం ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న చారిత్రాత్మక నిర్ణయం బీసీలందరికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన నిర్వహించే బిల్లును ఆమోదించినందుకు, ఈ ప్రక్రియ కోసం భారీ నిధులను కేటాయించినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలకు, కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇస్తామని కుమారస్వామి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా బషీర్ బాగ్ లో రేవంత్ రెడ్డి (Revanth Reddy), పొన్నం ప్రభాకర్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దుండ్ర కుమారస్వామి.. గత ప్రభుత్వాలు కీలకమైన డిమాండ్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కుల గణన డేటా.. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి, సంక్షేమ పథకాలు మరియు రిజర్వేషన్ల విధానాలను పెంపొందించడానికి సహాయకారిగా ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని హర్షించారు.
ఈ కులగణన తెలంగాణాలో వివిధ వెనుకబడిన సామాజిక మరియు ఆర్థిక, విద్యా, ఉద్యోగ స్థితిగతులపై ఖచ్చితమైన డేటాను అందిస్తుందని, ఈ సమాచారం ప్రభావవంతమైన విధానాలు మరియు కార్యక్రమాలను రూపొందించడానికి దోహద పడుతుందని దుండ్ర కుమార స్వామి తెలిపారు. కుల గణన సజావుగా మరియు సమర్థవంతంగా జరిగేలా ఖచ్చితమైన డేటా సేకరణకు స్వచ్ఛంద సహాయాన్ని అందిస్తానన్నారు.
తెలంగాణాలో సామాజిక న్యాయం మరియు సమ్మిళిత అభివృద్ధి ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని దుండ్ర కుమార స్వామి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో నేషనల్ ఓబీసీ ప్రొటెక్షన్ ఫోరం ఆళ్ల రామకృష్ణ, సీఎం రేవంత్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, రాజేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ అజయ్ సాయి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.





