Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాన్వాయ్‌లోని వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. కాగా, సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో (Kodangal) పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యలో సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది.
అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. సీఎం భద్రతా సిబ్బంది వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌ను పిలిపించారు. పేలిన టైర్లు రిపేరి చేయడంతో మళ్లీ వాహనాలు కొడంగల్‌కు బయలు దేరాయి. ఈ ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మొయినాబాద్ మీదుగా కొడంగల్ మీటింగ్‌కు బయలు దేరారు.
గత నెల 17న సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిని పసిగట్టిన పైలట్లు సకాలంలో ల్యాండింగ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ అదే విమానంలో ఉన్నారు. పైలట్ల చాకచక్యంతో వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
అదేవిధంగా మార్చిలోనే రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌లో 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.