ఆధునిక భారతం(Bharat)లో టెక్నాలజీ(Technology) కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏఐ నిపుణులు అనేక నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రజల మూడ్ను పసిగట్టే కొత్త టెక్నాలజీలపై కసరత్తు చేస్తున్నారు.
ఎన్నికలు వచ్చాయంటే ర్యాలీలు, సభలు, యాత్రలతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనే జనాల మూడ్ను అంచనా వేసేందుకు ప్రత్యేక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారంగా పనిచేసే విధానం ద్వారా సమావేశాలు, మహాసభలు, ర్యాలీల్లో పాల్గొన్న జనాలు ఆ పార్టీ గురించి ఏమని ఆలోచిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేలా డిజైన్ చేస్తున్నారు.
ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ముంబై కంప్యూటర్ నిపుణులు చేపట్టిన ఈ ప్రాజెక్టు రానున్న రోజుల్లో ఎన్నికల ప్రక్రియల్లో కీలకంగా మారనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎనాలసిస్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ముఖ కవళికలను బట్టి వారి మానసికస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆలోచన పరిపక్వత, శారీరక రుగ్మతలను అంచనా వేస్తున్నారు.
అదనంగా మరికొన్ని అంశాలను జోడించి జనాల మూడ్, ఆలోచన ధోరణిని టెక్నాలజీ ద్వారా విశ్లేషించేలా ఏఐని రూపొందిస్తున్నారు. సభలు, సమావేశాల్లో తీసిన వీడియోలు, ఫొటోలను ఏఈ టెక్నాలజీతో కూడిన ఎనాలసిస్ వ్యవస్థకు అనుసంధానం చేయగానే వాటిని విశ్లేషించి సంబంధిత సమావేశంపై కలిగిన అభిప్రాయాన్ని హావభావాలతో గుర్తించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రయోగదశలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, కచ్చితంగా అంచనా వేసేందుకు వీలుంటుదని ఐటీ నిపుణులు చెబుతున్నారు.