బీఆర్ఎస్ (BRS)ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలవడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. తాజాగా మరో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి (Teegala Krishna Reddy) సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గతంలో హైదరాబాద్ మేయర్గా, మహేశ్వరం ఎమ్మెల్యేగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
ఆ తర్వాత పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మహేశ్వరం టికెట్ ఆశించారు. కానీ ఆయనకు కేసీఆర్ టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. మొదట్లో ఎమ్మెల్సీ ఇస్తానని, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారని తన సన్నిహితుల దగ్గర తీగల వాపోయినట్టు తెలుస్తోంది.
మరోవైపు మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాజాగా మోత్కుపల్లి కూడా ఈ రోజు సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ సర్కార్ నెల రోజుల పాలన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఒరవడితో ముందుకు సాగుతోందన్నారు.