పర్యాటకులను(Tourists) ఓ ఏనుగు(Elephant) హడలెత్తించింది. ఆ సమయంలో కొంతమంది పర్యటకులు సఫారీ కారులో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్, టూరిస్ట్ గైడ్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(UP)లోని దుధ్వా టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది.
లఖింపుర్ భేరిలోని దుధ్వా టైగర్ రిజర్వును సందర్శించడానికి కొంతమంది పర్యటకులు సఫారీ కారు(జిప్సీకారు)లో వెళ్లారు. కొంచెం దూరం వెళ్లేసరికి అక్కడ వారికి ఓ ఏనుగుల గుంపు కనిపించింది. ఆ పర్యటకుల్లో కొంతమంది గజరాజుల ఫొటోలను తీసేందుకు కారులోంచి కిందికి దిగారు.
ఆ సమయంలో ఏనుగుల గుంపులో ఓ గజరాజుకు చిర్రెత్తుకొచ్చి పర్యటకులను వెంబడించింది. ఈ క్రమంలో జంగిల్ సఫారీ డ్రైవర్, గైడ్ అప్రమత్తతో టూరిస్టులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన కొందరు వన్యప్రాణి ప్రేమికులు ఘాటుగా స్పందించారు. అడవి జంతువులకు రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తించరాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ‘ఎక్కడికెళ్లినా అతి అంత మంచిది కాదని.. తిక్క కుదిరింది..’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.