– నిలువ నీడ లేని నీకు టీడీపీనే ఆధారమైంది
– తెలంగాణ పట్ల నా నిబద్ధత ఎప్పుడూ మారలేదు
– సోనియా వల్లే రాష్ట్రం సాకారమైందన్న మీరు..
– నన్ను, కాంగ్రెస్ ని దోషిగా ఎలా నిలబెడతారు
– కాంగ్రెస్ ను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా?
– కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా తక్కువ రోజులే నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంత తక్కువ సమయంలో ప్రజా సమస్యలపై సరిగ్గా చర్చే జరగలేదని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ (Congress) ను తిట్టడానికే సమావేశాలు ఏర్పాటు చేసినట్టుగా ఉందని మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ (Revanth).. వరదలు, విద్యార్థుల సమస్యలు, ఏ అంశాలపైనా చర్చ జరపలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ (KCR) అతి తీవ్రంగా విమర్శించారని ఫైరయ్యారు. కేసీఆర్, కేటీఆర్ సభను మొత్తం తనపై తిప్పారని అన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) కు కొన్ని ప్రశ్నలు వేశారు రేవంత్ (Revanth). ‘‘నేనూ, కేసీఆర్.. టీడీపీ నుంచి వచ్చిన వారమే. చంద్రబాబు సహచరుడిగా నా ప్రస్థానం టీడీపీలో కొనసాగింది. చంద్రబాబు అనుచరుడిగా కేసీఆర్ ప్రయాణం టీడీపీలో మొదలైంది. నిలువ నీడలేని కేసీఆర్ కి టీడీపీ ఆసరాగా నిలిచింది. నేను ఎమ్మెల్సీగా గెలిచి టీడీపీకి వెళ్లాను. జూబ్లీహిల్స్ లాంటి సొసైటీకి డైరెక్టర్ గా అత్యంత పిన్న వయసులో ఎన్నికయ్యాను’’ అని చెప్పారు. తెలంగాణ పట్ల నా నిబద్ధత ఎప్పుడూ మారలేదని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై ప్రశ్నించడంలో ఎప్పుడైనా ముందే ఉన్నానని అన్నారు.
చంద్రబాబుతో కేసీఆర్ ఉన్నప్పుడు 610 జీవోపై తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు రేవంత్. 1996లో 610 జీవోను, జోనల్ విధానం రద్దు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన ద్రోహి కేసీఆర్ కాదా అని అడిగారు. 1996లో మంత్రిగా కేసీఆర్ మాట్లాడిన మాటలు వినాలని కేటీఆర్ కు సూచించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించన వాళ్లతో చాలామంది ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారని సెటైర్లు వేశారు. ఎవరికీ తలవంచకుండా రాష్ట్రం కోసం మాట్లాడిన నిఖార్సైన తెలంగాణ బిడ్డను తానేనని అన్నారు.
గద్దర్ కు నివాళులు
ప్రజా యుద్ధనౌక గద్దర్ పాటలు తెలంగాణ ప్రజలను ఆలోచింపచేశాయని అన్నారు రేవంత్. ఆయన మరణం తెలంగాణ ప్రజలను కన్నీటి దుఃఖంలో ముంచిందని తెలిపారు. దళితులకు, గిరిజనులకు ఎవరికి ఏ దుఃఖం ఉన్నా అది తనదని గద్దర్ భావించే వారిని చెప్పారు. గద్దర్ మృతి విషయం తెలిసి అన్ని పనులు మానుకుని భౌతికకాయం దగ్గరకు వెళ్లామని.. ఆయన మరణం రాజకీయం కావొద్దు అని మాట్లాడలేదన్నారు. కేసీఆర్ కు నిఘా అధికారులు గద్దర్ మృతిని తెలియజేశారని.. అసెంబ్లీలో చర్చ, నివాళి అర్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి.