Telugu News » KTR : మీరు దయ తలిస్తే గెలుస్తా.. లేదంటే ఇంట్లో ఉంటా..!

KTR : మీరు దయ తలిస్తే గెలుస్తా.. లేదంటే ఇంట్లో ఉంటా..!

ఓట్ల కోసం మందు పోయించి, పైసలు పంచేవారిని నమ్మవద్దని పేర్కొన్నారు.

by admin
Minister KTR Speaks About Govt Schemes

– వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన
– పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
– కలెక్టరేట్ లో బీసీలకు చెక్కుల పంపిణీ
– ఎలక్షన్స్ లో పైసలు ఇచ్చే వారిని నమ్మొద్దని సూచన

సీఎం కేసీఆర్ పాల‌న సంక్షేమానికి స్వ‌ర్ణ‌యుగంగా మారింద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేములవాడ ముఖద్వారం వద్ద సుందరీకరించిన నంది కమాన్ తోపాటు చింతల్ ఠాణా వద్ద ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను, నవజాత శిశువులు, శిశువులలో ఎదుగుదల లోపాలు లేకుండా చూసుకునేందుకు ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్(DEIC) ను, మాతృ సేవా కేంద్రాన్ని స్టార్ట్ చేశారు.

పట్టణ ప్రజలతో పాటు రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని అందించే విధంగా అభివృద్ధి చేసిన మూలవాగు బండ్ ను, తిప్పాపురం గోశాల యందు ఏర్పాటు చేసిన బయో గ్యాస్ ప్లాంట్ ను ప్రారంభించారు కేటీఆర్. 47 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన రక్షిత మంచినీటి సరఫరాను.. పట్టణంలోని భగవంతరావు నగర్ లో 3 కోట్లతో నిర్మించిన కూరగాయల మార్కెట్ ను ఓపెన్ చేశారు. అలాగే, బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు, శ్రీ రాజరాజేశ్వర సదనం నిర్మాణానికి, శివార్చన వేదిక నిర్మాణానికి, గుడి చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమాల తర్వాత కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పని చేసే ప్రభుత్వాలను ప్రజలు కాపాడుకోవాలని సూచించారు. ఓట్ల కోసం మందు పోయించి, పైసలు పంచేవారిని నమ్మవద్దని పేర్కొన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రానికి ఎలాంటి ఢోకా ఉండదని తెలిపారు. ఓట్ల కోసం తన జీవితంలో మందు పోయ‌లేదు.. పైస‌లు పంచ‌లేదన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అది చేయనని స్పష్టం చేశారు. మీ ద‌య ఉంటే మ‌ళ్లీ గెలుస్తా.. లేక‌పోతే ఇంట్లో కూర్చుంటానంటూ ప్రజలనుద్దేశించి అన్నారు.

సెప్టెంబ‌ర్‌ లో సిరిసిల్ల‌లో మెడిక‌ల్ కాలేజీని సీఎం ప్రారంభిస్తారని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో ఈ నెల‌లో 600 మంది ల‌బ్దిదారుల‌కు రూ.ల‌క్ష చొప్పున సాయం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌తి నెలా నియోజ‌క‌వ‌ర్గానికి 300 మందికి రూ.ల‌క్ష చొప్పున సాయం ఇస్తామ‌న్నారు. జిల్లాలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న 10 వేల మందికి త‌ప్ప‌కుండా అందించి తీరుతామని తెలిపారు. ద‌ళితులు, బీసీల‌కు అందిస్తున్న మాదిరిగానే మైనార్టీల‌కు కూడా రూ.ల‌క్ష ఆర్థిక సాయం త్వ‌ర‌లోనే అంద‌జేస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం ఇస్తున్న సాయం తిరిగి క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్.

You may also like

Leave a Comment