రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం తాండవిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో గిరిజనులను బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
ములుగు జిల్లా రామానుజపురంలో నిర్వహించిన విజయ భేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. వందలాది మంది బలిదానాలతో తెలంగాణ స్వప్పం సాకారమైందని తెలిపారు. అమరులు, నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాశలు చేశారని మండిపడ్డారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందన్నారు. ఇంటింటికీ వెళ్లి గ్యారెంటీ కార్డులను ఇచ్చి దానిపై తమ పార్టీ నేతలు సంతకాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆ గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500లకు గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. రైతులకు ఏటా రూ.15 వేలు ఇస్తామన్నారు. కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు.. తులం బంగారం కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు గాంధీ కుటుంబం వచ్చిందన్నారు.