తెలంగాణ(Telangana)లో భారీగా ట్రాఫిక్ చలానాలు(Traffic Challan) పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది పెండింగ్‌లో ఉన్న చలాన్లకు భారీ డిస్కౌంట్(Discount) ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రూ.300కోట్ల వరకు వసూళ్లు రాబట్టారు.
నిర్ణీత సమయంలో ఆ డిస్కౌంట్ ఇవ్వడంతో వాహనదారులు జరిమానాల నుంచి బయటపడాలని వెంటనే కట్టేశారు. అయితే, ఇదే తరహాలో మరోమారు డిస్కౌంట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న చలానాలు రాబట్టేందుకే ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది సర్కార్.
తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించేవారికే ఈ రాయితీ వర్తిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి, చలానాలు విధించడం అధికారులకు సులభమైంది.
అయితే చాలామంది వాహనదారులు చలానాలను చెల్లించడం లేదు. పోలీసుల తనిఖీల్లో మాత్రమే చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వాహనదారులు గతేడాదిలాగే డిస్కౌంట్ ఏమైనా ఉంటే బాగుండేది అనుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్‌ను కొద్దిరోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.