నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉదయం 6 గంటల వరకు పీవీ ఎక్స్‌ప్రెస్‌వే , ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను అనుమతించడం లేదని సైబరాబాద్ సీపీ అవినాశ్ మొహంతి (Avinash Mohanthi) వెల్లడించారు. ఆయా రూట్లలో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వాటిలో పాసులు ఉన్న వాహనదారులకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వాహనాదారులు అనుసరించాల్సిన నియమాలను సీపీ అవినాశ్ మొహంతి వివరించారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో మద్యం సేవించి వాహనాలు నడిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పబ్, క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మద్యం సేవించిన కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేస్తున్నారు. క్యాబ్, ఆటో డ్రైవర్స్ రైడ్స్ నిరాకరించవద్దన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై మోటార్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు నూతన సంవత్సర ప్రారంభ వేడుకల సమయంలో పోలీసులకు ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందని ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. డిసెంబర్ 31 రాత్రి 10.00 గంటల నుంచి జనవరి 1న ఉదయం వరకు పెద్ద ఎత్తున చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.