మెదక్ (Medak) జిల్లాలో శిక్షణ విమానం కూలిపోయింది. తుఫ్రాన్ (Tufran) మండలం, రావెల్లి (Ravelli) కొండల్లో శిక్షణ విమానం కూలిపోడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో పెద్ద శబ్ధంతో విమానం కూలిపోయి (Flight Crash) భారీగా మంటలు చెలరేగడం స్థానికులు గమనించారు. కాగా విమానం కూలిన సమయంలో, సమీపంలో పని చేస్తున్న రైతులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
కానీ అప్పటికే విమానం పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో దగ్గరకు వెళ్లడానికి ఎవరు సాహసించలేదు. మరోవైపు ప్రమాదంపై పోలీసులకు, స్థానికులు సమాచారం అందించారు. కాగా ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రైనీ పైలట్లు ప్రమాదం నుంచి బయటపడ్డారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు ప్రమాదం విషయం తెలుసుకున్న దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అధికారులు హెలికాప్టర్ లో ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం దుండిగల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన శిక్షణ విమానంగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈమేరకు సాంకేతిక లోపం కారణంగా శిక్షణ విమానం కూలినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని పోలీసులు, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పరిశీలిస్తున్నారు.